
న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారోగ్య సంరక్షణను మరింత ఆధునీకరించేందుకు కీలక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రాష్ట్రంలోని మొట్టమొదటి డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రారంభించారు.
ఈ కేంద్రాన్ని టాటా సంస్థ సహకారంతో ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రజల ఆరోగ్య రికార్డులు డిజిటల్‌గా భద్రపడి, వైద్య సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందనున్నాయి.
ప్రస్తుతం కుప్పం ఏరియా ఆసుపత్రి, 13 పీహెచ్‌సీలు, 92 గ్రామ ఆరోగ్య కేంద్రాలు ఈ నెర్వ్ సెంటర్‌తో అనుసంధానించబడ్డాయి. వ్యాధి నిర్ధారణ, వైద్యుల అపాయింట్మెంట్లు, కౌన్సెలింగ్ సేవలు ఇలా అన్ని ఒకేచోట లభించనున్నాయి.
అవసరమైన సందర్భాల్లో వర్చువల్ మోడ్‌లో వైద్య నిపుణులతో రోగులకు సేవలు అందించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం సేవలను, ప్రైవేటు ఆసుపత్రులను కూడా ఈ కేంద్రం ద్వారా అనుసంధానించే అవకాశం కల్పించారు.
కుప్పంలో మొదటి దశగా ప్రారంభమైన ఈ సేవలు, త్వరలో చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనుంది. ఇది రాష్ట్ర ఆరోగ్య రంగానికి దిశానిర్దేశక చర్యగా భావిస్తున్నారు.
