
న్యూస్ డెస్క్: అమెరికాలో ఉన్నత విద్యకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో, విదేశీ విద్యార్థులకు స్టూడెంట్ వీసా దరఖాస్తులను అమెరికా ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. నెల రోజుల విరామం తర్వాత జూన్ 18 నుంచి ఈ ప్రక్రియను పునఃప్రారంభించినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.
విద్యార్థుల ధ్యాస పూర్తిగా చదువుపైనే ఉండాలని అమెరికా హెచ్చరించింది. “వీసా ఉద్దేశాన్ని విస్మరించి ఇతర కార్యకలాపాల్లో పాల్గొనటం, చదువు వదిలేయడం, విధ్వంసక చర్యలు చేస్తే సహించము” అని అధికార ప్రతినిధి మిగ్నాన్ హ్యూస్టన్ స్పష్టం చేశారు.
అలాగే, దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను ‘పబ్లిక్ వ్యూ’లో ఉంచాలని ఆదేశించారు. లేదంటే, దరఖాస్తు తిరస్కరణతో పాటు అమెరికాలో ప్రవేశించే అవకాశాలను కూడా కోల్పోతారని హెచ్చరించారు.
ఇక స్టూడెంట్ వీసాలకు కాలపరిమితి విధించాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటి ప్రకారం, వీసా గడువు పూర్తైన వెంటనే విద్యార్థులు పొడిగింపుకు మళ్లీ అప్లై చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం సమీక్షలో ఉన్నాయని అధికారులు తెలిపారు. దీనివల్ల ఫుల్ టైమ్ స్టడీ వీసాలు ఉన్నవారికి భవిష్యత్తులో నిబంధనలు మరింత కఠినంగా మారే అవకాశం ఉంది.
