
న్యూస్ డెస్క్: 2025 సంవత్సరంలో టెక్నాలజీ రంగ ఉద్యోగులకు గడ్డుకాలంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షకు పైగా టెక్ ఉద్యోగాలపై కోత పడింది. ఖర్చుల తగ్గింపు, ఏఐ విస్తరణ, కంపెనీల పునర్‌వ్యవస్థీకరణ వంటి అంశాలు ఈ పరిణామాలకు దారితీస్తున్నాయి.
తాజాగా మైక్రోసాఫ్ట్, ఇంటెల్ వంటి దిగ్గజ సంస్థలు వేలాదిమందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ విభాగంలో 9,100 మందిని తొలగించగా, ఇంటెల్ 20 శాతం ఉద్యోగాలపై కోత విధించనుంది.
అమెజాన్, గూగుల్, మెటా సంస్థలు కూడా వందలాది ఉద్యోగాలను తొలగించాయి. ఐబీఎం 8,000 హెచ్‌ఆర్ ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయనుంది.
ఇండియా టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ కూడా సత్తా చాటలేకపోయిన 240 ఎంట్రీ లెవల్ ఉద్యోగులను తొలగించింది. గతంలో కూడా 300 మంది ఫ్రెషర్లను తొలగించింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిణామాలకు ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రంగంలో నైపుణ్యాలు ఉన్నవారికి డిమాండ్ పెరుగుతుండగా, సాధారణ ఉద్యోగాలకు గండిపడుతోంది.
సేల్స్‌ఫోర్స్, హెచ్‌పీ, ఓలా ఎలక్ట్రిక్ వంటి సంస్థలు కూడా ఉద్యోగుల కోతను ప్రకటించడంతో టెక్ రంగ భవిష్యత్తుపై ఆందోళనలు పెరిగాయి.
