
న్యూస్ డెస్క్: తెలంగాణలోని పశమైలారాలో ఉన్న సిగాచీ కెమికల్స్‌లో సోమవారం జరిగిన పేలుడు ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. మొదట్లో 12గా ఉన్న మృతుల సంఖ్య నేడు 42కి చేరుకుంది.
మంగళవారం ఉదయం నుంచి సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతుండగా శిథిలాల నుంచి మరిన్ని మృతదేహాలు వెలికితీయబడ్డాయి. అధికారులు ఇంకా మరిన్ని దేహాలు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, “శిథిలాలను తొలగించగా మరికొన్ని మృతదేహాలు బయటపడ్డాయి. సహాయక చర్యలు చివరి దశలో ఉన్నాయి” అని తెలిపారు.
ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, సంఘటన స్థలాన్ని సందర్శించేందుకు సిద్ధమయ్యారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్మిక శాఖ అధికారులతో మాట్లాడి సహాయ చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. పూర్తి నివేదిక త్వరలో రావొచ్చని సమాచారం.
