
న్యూస్ డెస్క్: ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ గెలిచిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు, ఏసీసీ చైర్మన్, అలాగే పాక్ మంత్రి మొహిసిన్ నఖ్వీ చేసిన పని ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది.
భారత్ జట్టు గెలిచిన తర్వాత ట్రోఫీ అందించే కార్యక్రమంలో నఖ్వీ పాల్గొనకుండానే హోటల్‌కి వెళ్లిపోయాడు. అంతే కాకుండా ఆసియా కప్ ట్రోఫీతో పాటు మెడల్స్‌ని కూడా తనతో తీసుకెళ్లాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బీసీసీఐ ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏసీసీ చైర్మన్‌కి ఆ హక్కు లేదని, కనీసం ఆతిథ్య దేశ బోర్డు ప్రతినిధి చేతుల మీదుగా అయినా ట్రోఫీ ఇవ్వాల్సిందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ వ్యవహారాన్ని పిల్లల చేష్టలతో పోల్చి ఎగతాళి చేసింది.
అంతేకాదు, ఈ ఘటనపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఫిర్యాదు చేయబోతున్నామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. ట్రోఫీ ఆలస్యమైనా తప్పక భారత్ జట్టుకు వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
నఖ్వీ ప్రవర్తన వెనుక రాజకీయ కోణం ఉందన్న చర్చ కూడా మొదలైంది. ముఖ్యంగా పాక్ మంత్రి అయినందున, భారత్ పట్ల వ్యతిరేకతతోనే ఇలా చేశాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి, ఆసియా కప్ గెలుపు ఆనందం తర్వాత నఖ్వీ చర్యలతో మరోసారి భారత్ పాక్ మధ్య మాటల యుద్ధం ముదిరింది.