
న్యూస్ డెస్క్: టీమ్ ఇండియాలో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు ఇప్పుడు ప్రధాన శక్తిగా నిలుస్తున్నారు. ఇకపై జట్టులో ఉండటం మాత్రమే కాదు.. మ్యాచ్ గెలిపించే హీరోలుగా కూడా పేరు తెచ్చుకుంటున్నారు.
ఇంగ్లండ్‌లో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో పేసర్ మొహమ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. బుమ్రా గాయం కారణంగా పక్కనపడ్డా.. ఒంటరిగా బౌలింగ్ బాధ్యతలు తీసుకున్న సిరాజ్, మొత్తం 23 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. చివరి టెస్టులో 9 వికెట్లు తీయడంతో దేశం గర్వపడేలా చేశాడు.
దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో తిలక్ వర్మ తన ప్రతిభ చూపించాడు. తొలి మూడు వికెట్లు త్వరగా కోల్పోయిన భారత్ ఒత్తిడిలో పడగా.. 53 బంతుల్లో 69 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ లేకపోతే టీమ్ ఇండియా గెలుపు కష్టమయ్యేదని అందరూ అంగీకరిస్తున్నారు.
ఇక విశాఖపట్నం కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఆకట్టుకుంటున్నాడు. టెస్టుల్లో, టి20ల్లో తానూ రాణిస్తూ భవిష్యత్తులో హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేసే సత్తా చూపిస్తున్నాడు.
సిరాజ్, తిలక్, నితీశ్ ప్రదర్శనలు చూస్తుంటే, తెలుగు రాష్ట్రాల కుర్రాళ్లు భారత క్రికెట్‌లో మరింత కీలక పాత్ర పోషించబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
