
ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పరీక్ష రాసిన లక్షలాది మంది అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ముందుగా ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, చివరి నిమిషంలో ఫలితాలను వాయిదా వేసినట్లు హోంమంత్రి అనిత తెలియజేశారు.
ఫలితాల ప్రకటనలో జాప్యం రావడానికి కారణంగా తుది జాబితాను మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ తెలిపింది. ఎలాంటి పొరపాట్లు లేకుండా, అభ్యర్థుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడకూడదని అధికారులు అంటున్నారు.
బుధవారం నాడు ఫలితాలను విడుదల చేస్తామని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఈసారి మొత్తం 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 2022 జనవరి 22న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 5,09,579 మంది దరఖాస్తు చేయగా, 4,58,219 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
అర్హత మార్కులు ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు. పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.