
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన మద్యం స్కామ్ కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటివరకు 14 మందిని అరెస్ట్ చేసి, రూ.3,500 కోట్ల కుంభకోణాన్ని వెలికితీసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ముగ్గురు కీలక నిందితులకు బెయిల్ మంజూరవడంతో కేసు దిశ మార్చుకుంటుందా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ ఆడిటర్ బాలాజీ గోవిందప్పలకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరు మే 13 నుంచి జైలులో ఉన్నారు. ముందస్తు బెయిల్ ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, తాజాగా చార్జ్ షీట్‌లో స్పష్టమైన ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. దీనితో వీరికి ఎటువంటి కఠిన షరతులు లేకుండా బెయిల్ లభించింది.
అదే రోజు ఎంపీ మిథున్ రెడ్డికి కూడా ఓటు హక్కు కోసం షరతులతో బెయిల్ మంజూరవడం రాజకీయ చర్చలకు దారితీసింది. ఇక జైలులో ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. ఇప్పటికే నలుగురు బయటకు రావడంతో, ఆయనకూ అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని న్యాయవాదులు అంటున్నారు.
ఈ పరిణామాలు స్కామ్ కేసులో పెద్ద మలుపు తిప్పే అవకాశం ఉందని, దర్యాప్తు వేగం తగ్గవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.