
అఖండ 2: తాండవం రివ్యూ.. సినిమా ఎలా ఉంది?
కథ
మురళీకృష్ణ (బాలకృష్ణ) ఎమ్మెల్యేగా రాయలసీమలో ఉంటాడు. అతని కూతురు జనని (హర్షాలీ మల్హోత్రా) డీఆర్డీవోలో సైంటిస్ట్. సైనికుల కోసం అన్ని వాతావరణాలను తట్టుకునే బయో-సూట్ తయారు చేస్తుంది. సరిగ్గా అదే టైమ్‌లో, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే నాయకుడి అండతో చైనా ఆర్మీ జనరల్ కుట్ర చేస్తాడు. దాని వల్ల గంగా నదిలో ఒక వైరస్‌ని కలిపేసి, కుంభమేళాకు వచ్చిన లక్షల మందికి ఆ వైరస్ అంటుకునేలా చేస్తాడు. దేశం మొత్తం అల్లకల్లోలం అవుతుంది.
ఈ వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేసే బాధ్యతను జనని తీసుకుంటుంది. కానీ, వ్యాక్సిన్‌ను కూడా నాశనం చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఈ కష్ట సమయంలో, మురళీకృష్ణ సోదరుడు, అఘోరా అయిన అఖండ (బాలకృష్ణ) ఎంట్రీ ఇస్తాడు. అఖండ శత్రువులతో ఎలాంటి పోరాటం చేశాడు, దేశానికి వచ్చిన ముప్పును ఎలా తప్పించాడు అన్నదే మిగతా స్టోరీ.
విశ్లేషణ
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే మాస్ జాతర. గతంలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. అయితే, వరుస విజయాలతో వచ్చిన అతి విశ్వాసం వల్లనే ‘అఖండ 2: తాండవం’ తీశారా అనే ఫీలింగ్ సినిమా చూస్తున్నప్పుడు వస్తుంది. మాస్ అంటే కొంచెం అతి ఉంటుందని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, ‘అఖండ-2’లో ఆ అతి అనేది హద్దులు దాటిపోయింది.
మనిషిని తల కిందకు చేసి హారతి ఇవ్వడం, హెలికాప్టర్ రెక్కలను త్రిశూలంతో ఆపరేట్ చేయడం, ఇండియన్ ఆర్మీ చేయలేని పనిని హీరో ఒక్కడే చేయడం, చైనా మీదకు యుద్ధానికి వెళ్లి ఆర్మీ జనరల్‌ను చంపడం లాంటి సీన్స్ మామూలుగా లేవు. మాస్ మూవీస్ అంటే ఇవే కదా అని ఎంజాయ్ చేసే వాళ్లకు ఈ సినిమా పండగే. కానీ, లాజిక్ గురించి ఆలోచించే వాళ్లకు మాత్రం ఇది ట్రోలింగ్ స్టఫ్ లాగా అనిపిస్తుంది.
‘అఖండ 2’లో బాలకృష్ణ నటన, పవర్ ఫుల్ డైలాగులు అభిమానులకు చాలా బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఖండ రీ-ఎంట్రీ, ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేలా ఉంది. కానీ, సినిమా మొత్తంలో యాక్షన్ సీన్స్ ఓవర్ డోస్ అవడం, విలన్లు చాలా వీక్ గా ఉండటం వల్ల ఫస్ట్ పార్ట్‌లో ఉన్నంత కిక్ ఈసారి మిస్సయ్యింది. ‘అఖండ’లో శివుడి ఎలిమెంట్స్ చాలా ఆర్గానిక్‌గా అనిపించాయి. కానీ, ఈ సీక్వెల్‌లో అది కూడా ఓవర్ డోస్ అయిపోయి, ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ అవ్వదు.
ప్లస్ పాయింట్స్
బాలకృష్ణ పవర్ ఫుల్ పర్ఫామెన్స్
మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఇంటర్వెల్ ఎపిసోడ్
నిర్మాణ విలువలు, కెమెరా పనితనం
మైనస్ పాయింట్స్
మాస్ ఎలిమెంట్స్ చాలా అతిగా ఉండటం
సినిమాలో బలమైన విలన్లు లేకపోవడం
తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా చోట్ల శబ్ద కాలుష్యంలా అనిపించడం
‘అఖండ’లో ఉన్న ఎమోషనల్ కనెక్ట్, సోల్ ఈ సినిమాలో మిస్సవడం
రేటింగ్: 2.75/5
