
విభిన్న కథలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అడివి శేష్, ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘గూఢచారి’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి హిట్ల తర్వాత శేష్ నుంచి కొత్త సినిమా రాకపోవడంపై అభిమానులు నిరుత్సాహంగా ఉన్న తరుణంలో, ఇప్పుడు డబుల్ ధమాకా ప్లాన్ చేస్తున్నాడు.
తాజా సమాచారం మేరకు, శేష్ తొలి విడుదలగా డెకాయిట్ సినిమాను 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది.
తొలుత శ్రుతి హాసన్ ఎంపికై, తరువాత తప్పుకోవడంతో మృణాల్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఫుల్ స్పీడ్‌లో కొనసాగుతోంది.
ఇక శేష్ కెరీర్‌కు మైలురాయిగా నిలిచిన ‘గూఢచారి’ సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. గూఢచారి-2 సినిమాను వినయ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్టైన్మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో శేష్ సీక్రెట్ ఏజెంట్‌గా మరింత పవర్ఫుల్ మోడ్‌లో కనిపించనున్నాడని సమాచారం. మొదటి భాగాన్ని మించి ఆకర్షణీయంగా ఉండేందుకు విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. డెకాయిట్కి మంచి విజయాన్ని అందిస్తే గూఢచారి-2 హైప్ డబుల్ కానుంది.
తన సినిమాల మధ్య గ్యాప్ తగ్గిస్తానన్న హామీని నెరవేర్చేందుకు శేష్ తన రిలీజ్ షెడ్యూల్ క్లియర్ చేసుకుంటున్నాడు. వరుసగా రెండు సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్న శేష్ ఏ మేరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
