
న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం కల్తీ లిక్కర్ వ్యవహారంతో హీటెక్కిపోతోంది. రాష్ట్రంలో ఇంతటి కీలకమైన రాజకీయ వ్యవహారం సాగుతున్న వేళ, వైఎస్ జగన్ దూరంగా విదేశాలలో ఉండటం వైసీపీకి పెద్ద ఇబ్బందిగా మారింది.
కల్తీ మద్యంపై వైసీపీ చేసిన ఆరోపణలు ఇప్పుడు బూమరాంగ్ కావడంతో, పార్టీ కౌంటర్ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించాల్సిన సమయంలో అధినేత రాష్ట్రంలో లేకుండా పోయారనే మాట పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
వైసీపీ సాధించిన అప్పర్ హ్యాండ్ హఠాత్తుగా చేతులు మారింది. టీడీపీ ఇప్పుడు నిందితుడు జనార్ధనరావు వీడియో క్లిప్ ఆధారంగా మాజీ మంత్రి జోగి రమేష్‌ను టార్గెట్ చేస్తూ వైసీపీని పూర్తిగా కార్నర్ చేస్తోంది. నిందితుడి ఆరోపణలను జోగి రమేష్ ఖండిస్తున్నా, ఇది కేవలం డిఫెన్స్ మెకానిజం కిందకే వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
అఫెన్స్ మోడ్‌లో ఉండాల్సిన వైసీపీ, రెండు రోజుల వ్యవధిలో ఇలా డిఫెన్స్‌లో పడిపోవడం పార్టీని డీలా పడేలా చేసింది. కల్తీ మద్యం విషయంలో వైసీపీ ఆరోపణలలోనే కల్తీ ఉందని టీడీపీ చెబుతోంది. దీని వెనుక అంతా వైసీపీయే ఉందని దూకుడుగా ఆరోపిస్తోంది.
జగన్ ఈ నెల 23 తరువాతే ఏపీకి తిరిగి వస్తారు. ఈలోగా ఈ ఇష్యూలో జరగాల్సినవి అన్నీ జరిగిపోతాయని, పార్టీకి జరగాల్సిన నష్టం జరుగుతుందని అంటున్నారు. సరైన సమయంలో అధినేత అందుబాటులో లేకపోవడం వల్ల పార్టీ సీరియస్ ఇష్యూస్‌ను సమర్థవంతంగా టేకప్ చేయలేకపోయింది.
కల్తీ లిక్కర్ స్కామ్‌పై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన వైసీపీ, ఇప్పుడు మాజీ మంత్రిపై ఆరోపణలు రావడంతో డిఫెన్స్‌లో పడినట్లు అయింది. విపక్షాలకు అవకాశాలు వచ్చినపుడు వాడుకోవాలి, అదే సమయంలో తమ మీద నిందలు పడినప్పుడు అవి నిజాలు కావని నిరూపించుకునేలా మెకానిజం ఉండాలి.
