
న్యూస్ డెస్క్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో మాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా, జిల్లాల వారీగా 200 మంది మాల సామాజికవర్గంలోని ఉప కులాలకు చెందిన యువతను పోటీకి నిలబెట్టనున్నట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వారు హెచ్చరించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని తాము నిర్ణయించుకున్నట్టు నాయకులు చెప్పారు. ఇప్పటికే ఈ ఉప ఎన్నికలో పది మంది వరకు ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల నుంచి మరో ఏడెనిమిది మంది నామినేషన్లు వేయనున్నారు. తాజాగా మాల సామాజిక వర్గం నాయకుల ఈ ప్రకటన ఉప ఎన్నిక పోరును మరింత వేడెక్కించేలా చేసింది.
ఈ సంచలన నిర్ణయానికి ప్రధాన కారణం ఎస్సీ వర్గీకరణ విధానం. రాష్ట్రంలో ఆరు నెలలుగా జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఎస్సీల్లోని 58 ఉప కులాలకు తీరని అన్యాయం జరిగిందని మాల జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు.
మాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, ప్రెసిడెంట్ చెరుకు రామ్ చందర్ మాట్లాడుతూ, “ఎంపెరికల్ డేటా తీసుకుని, అన్ని వర్గాలతో చర్చించి వర్గీకరణ చేస్తామన్నారు. అవేవీ చేయకుండానే వర్గీకరణ చేసి 58 కులాల గొంతు కోశారు” అని ప్రభుత్వంపై దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల కారణంగా చదువుకున్న యువతకు తీరని అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తమను, తమ వర్గాన్ని పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో ఉన్న మాల సంఘం, ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో మాల సంఘం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
