
న్యూస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సంచలనం రేపారు. వామపక్ష భావజాలంతో ఉన్న యాంటీఫా (Antifa) ను ఉగ్రవాద సంస్థగా గుర్తించనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం అక్కడి రాజకీయాల్లో వేడి చర్చకు దారితీసింది.
అసలు యాంటీఫా అనేది ఒక ఫార్మల్ ఆర్గనైజేషన్ కాదు, ఒక ఐడియాలజీ మాత్రమే. అందుకే దీనిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం చట్టపరంగా క్లిష్టం అని నిపుణులు చెబుతున్నారు. కానీ ట్రంప్ తన కన్జర్వేటివ్ వర్గాన్ని సంతృప్తి పరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.
ఈ నిర్ణయం వెనుక ఆవేశం కూడా ఉందని అంటున్నారు. ముఖ్యంగా కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ హత్య తర్వాతే ఈ ప్రకటన రావడం దీనికి బలాన్నిస్తోంది. ఒక వ్యక్తి చర్యను మొత్తం ఉద్యమం మీద మోపడం సరికాదని విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు, యాంటీఫా నిరసనల్లో గతంలో చోటుచేసుకున్న హింస, పోలీసులపై దాడులు, ఆస్తుల ధ్వంసం కారణంగా జాతీయ భద్రతకు ముప్పు అని ట్రంప్ అనుచరులు భావిస్తున్నారు. అందుకే కఠిన చర్యలు తీసుకోవడానికి ఇదే సరైన మార్గమని వాదిస్తున్నారు.
రాజకీయ లాభం కూడా ఇక్కడ ఉంది. వామపక్ష భావజాలాన్ని బలహీనపరచడం, తన ఓటర్లైన మితవాద వర్గాలను ఆకర్షించడం ట్రంప్ స్ట్రాటజీగా కనిపిస్తోంది.
అయితే అమెరికాలోని చట్టాల ప్రకారం దీనికి కోర్టు పరీక్ష తప్పదు. ట్రంప్ నిర్ణయం అమలవుతుందా? లేక లీగల్ సవాళ్లలో ఆగిపోతుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.