
తెలంగాణ: రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు పై కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 నుంచి శాసనసభ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఐదు రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాల్లో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదిక ప్రధాన అంశంగా ఉండనుంది.
ఈ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టు అమలులో చోటుచేసుకున్న అవకతవకలపై స్పష్టమైన వివరాలు ఉన్నాయని సమాచారం. అయితే దీనిని కొట్టివేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు వారి వాదనలను తోసిపుచ్చి, నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగాలని సూచించింది.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, “అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటాం” అని కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు తీవ్రంగా జరిగే అవకాశం ఉంది.
ఇక నివేదిక పబ్లిక్ డొమైన్‌లోకి వెళ్ళకూడదని కోర్టు ఆదేశించింది. ఒకవేళ అందుబాటులో ఉంచి ఉంటే వెంటనే తొలగించాలని కూడా స్పష్టం చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ సమావేశాలతో కాళేశ్వరం అంశం తెలంగాణ రాజకీయాలపై మరింత ప్రభావం చూపనుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజల దృష్టి ఇప్పుడు అసెంబ్లీలో జరిగే చర్చలపైనే కేంద్రీకృతమైంది.