
న్యూస్ డెస్క్: ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే ఇప్పుడు గృహ బీమా రంగంలోకి అడుగుపెట్టింది. కేవలం రూ.181 వార్షిక ప్రీమియంతోనే ఇంటికి పూర్తి రక్షణ కల్పించే కొత్త పాలసీని కంపెనీ ప్రారంభించింది. ఈ సేవను పూర్తిగా డిజిటల్ విధానంలో, ఎటువంటి పత్రాల అవసరం లేకుండా యాప్ ద్వారా పొందవచ్చు.
ఈ పథకంలో వినియోగదారులు రూ.10 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.12.5 కోట్ల వరకు బీమా కవరేజీని ఎంచుకోవచ్చు. ఇల్లు మాత్రమే కాకుండా, ఇంట్లోని ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, విలువైన వస్తువులు కూడా ఈ పాలసీలో భాగమవుతాయి. అగ్నిప్రమాదం, వరదలు, భూకంపాలు, దొంగతనం వంటి 20కి పైగా రకాల నష్టాలకు ఈ బీమా రక్షణ కల్పిస్తుంది.
ఫోన్‌పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ సీఈఓ విశాల్ గుప్తా మాట్లాడుతూ, “ప్రతి భారతీయుడికి తక్కువ ఖర్చుతో బీమా అందించడమే మా లక్ష్యం. సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. ఆ ఆస్తిని కాపాడేందుకు మా కొత్త పాలసీ ఉపయోగపడుతుంది” అని తెలిపారు. వినియోగదారులు తమకు నచ్చిన పాలసీని కొన్ని నిమిషాల్లోనే ఎంచుకోగలరని అన్నారు.
సాధారణంగా గృహ రుణాలతో వచ్చే బీమా ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. కానీ ఫోన్‌పే పాలసీ గృహ రుణం ఉన్నవారికే కాకుండా, లేనివారికి కూడా అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ కొత్త ఆఫర్ గృహ యజమానులకు ఆర్థిక భద్రత కల్పించడంలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. తక్కువ ఖర్చుతో అధిక రక్షణను అందించడం ఫోన్‌పే బీమా ప్రత్యేకతగా నిలిచింది.
