
న్యూస్ డెస్క్: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యవహారశైలిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా వస్తున్న ఫిర్యాదులపై సీఎం అసహనం వ్యక్తం చేస్తూ, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఇటీవల కొన్ని అధ్యాపకులు ఎమ్మెల్యే వేధింపులకు గురిచేస్తున్నారంటూ నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. అలాగే ఎన్టీఆర్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే వివరణ ఇవ్వాలని దగ్గుపాటిని ఆదేశించారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే రెండు సార్లు ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చినప్పటికీ, ఆయన సమాధానం సీఎం సంతృప్తిని కలిగించలేదని తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి తప్ప, వారిని ఇబ్బందులకు గురిచేయరాదని సీఎం గట్టిగా చెప్పారు.
చంద్రబాబు మాట్లాడుతూ, తన దృష్టికి ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయని, అదే తీరు కొనసాగితే ఉపేక్ష ఉండదని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రవర్తన మారకపోతే క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టంచేశారు.
ఈ పరిణామాలు అనంతపురం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ లోపలే ఎమ్మెల్యేపై అసంతృప్తి పెరుగుతుండటంతో, సీఎం హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.
