
న్యూస్ డెస్క్: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల సంఖ్యను 2 శాతం తగ్గించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 12,000 మంది ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంది.
సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ చర్యలు చేపట్టబోతోంది. ముఖ్యంగా మిడిల్ మరియు సీనియర్ స్థాయిలో ఉన్న ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.
ఇటీవల టీసీఎస్ కొన్ని కీలక హెచ్‌ఆర్ విధానాల్లో మార్పులు చేసింది. ఉద్యోగులంతా కనీసం 225 బిల్లబుల్ రోజులు పనిచేయాల్సిందే. బెంచ్ టైమ్‌ను 35 రోజులకు పరిమితం చేశారు. సంస్థ ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచుతూ, కొత్త ప్రాజెక్టులపై దృష్టిపెట్టింది. మారుతున్న మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా వర్క్‌ఫోర్స్ మోడల్‌ను పునఃసంఘటితం చేయడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది.
కృతివాసన్, టీసీఎస్ సీఈవో మాట్లాడుతూ, “భవిష్యత్తుకు సన్నద్ధంగా ఉండేందుకు రీస్కిల్లింగ్, రీడెప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్‌లు కొనసాగుతున్నాయి. అయితే, కొన్ని సందర్భాల్లో ఉద్యోగులను సంస్థ విడిచి వెళ్లాల్సి వస్తోంది. వారికి అవసరమైన అన్ని విధాలుగా మద్దతు ఇస్తాం” అని చెప్పారు. సంస్థ ఈ చర్యలను మెల్లగా, జాగ్రత్తగా చేపట్టబోతున్నట్లు ఆయన వివరించారు.
ఉద్యోగుల భద్రతపై టీసీఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. రీడెప్లాయ్‌మెంట్ సాధ్యంకాకపోతే, ఉద్యోగులకు ఇన్సూరెన్స్, అవుట్‌ప్లేస్‌మెంట్ సర్వీసులు, ఇతర ప్రయోజనాలు అందజేస్తామని తెలిపారు. క్లయింట్ల సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని టీసీఎస్ తెలియజేసింది.
గత ఏడాది సంస్థ మొత్తం 6,21,000 ఉద్యోగులతో 27 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. అయినా, గ్లోబల్ ఐటీ మార్కెట్‌లో మారుతున్న పోటీ, టెక్నాలజీ ప్రగతి నేపథ్యంలో కంపెనీ తన వర్క్‌ఫోర్స్‌ను సరికొత్త దిశగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది.