
నితిన్ తమ్ముడు మూవీ రివ్యూ & రేటింగ్
కథ:
“తమ్ముడు” కథ నితిన్ పోషించిన జై అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతడి జీవిత లక్ష్యం వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ అవడం. కానీ ఎప్పటికీ తన గురి తప్పుతూనే ఉంటుంది. ఏం చేస్తూ ఉన్నా ఏకాగ్రత లోపిస్తుంటుంది. దీని వెనక ఉన్న కారణాన్ని అతడు వెతుకుతున్నప్పుడు, గతంలో జరిగిన కుటుంబ విభేదాలు, ముఖ్యంగా తన అక్క స్నేహాలత (లయ)తో జరిగిన సంఘటనలు అతడిని వెంటాడుతుంటాయి. ఆ తరువాత కుటుంబం కోసం అంబరాలగుడి అనే గ్రామనికి వెళ్లాల్సి వస్తుంది. జై తన స్నేహితురాలు చిత్ర (వర్ష బొల్లమ్మ) సహాయంతో ప్రయాణం మొదలెడతాడు.
ఇక కథలో మరో కోణం, వైజాగ్ ఫ్యాక్టరీ ప్రమాదం. ఈ ప్రమాదానికి కారణమైన ఓనర్ అజర్వాల్ (సౌరబ్) తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో ఆ ప్రమాదంలో తన అక్క ప్రాణాపాయం ఎదుర్కొంటోందన్న విషయం తెలిసిన జై, తన కుటుంబాన్ని కాపాడటానికి పోరాటం చేస్తాడు. ఈ ప్రయాణంలో అతడు ఎలా ముందుకెళ్లాడు, తన అక్కను కలుసుకున్నాడా, న్యాయం జరిగిందా అనే అంశాలే కథను నడిపించాయి.
విశ్లేషణ:
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన “తమ్ముడు” సినిమా ఒక మంచి ఎమోషనల్ డ్రామా అవుతుందనుకునే ప్రేక్షకుల ఆశలకు షాక్ ఇచ్చేలా సాగుతుంది. సినిమా మొదటి భాగం కొన్ని సీన్లతో సరే అనిపించినా, కథనంలో పుంజుకొనే అవకాశం ఇవ్వకుండా రెండో భాగంలో పూర్తిగా డ్రాప్ అయ్యింది. జై పాత్రలో నితిన్ పెట్టిన ప్రయత్నం స్పష్టంగా కనిపించినా, దర్శకుడు ఇచ్చిన కథలో బలం లేకపోవడంతో, ఆ పాత్రను నెక్స్ట్ లెవెల్ కు తీసుకు వెళ్లే స్థాయిలో స్క్రీన్‌ప్లే కనపడలేదు.
లయ పాత్రలో బాగానే చేశారు కానీ ఆమె పాత్రకు వచ్చిన ఎమోషనల్ డెప్త్ చాలా తక్కువ. విలన్ పాత్ర బాగా డిజైన్ చేసినట్టు అనిపించినా, క్లైమాక్స్‌లో అతడి పాత్ర కూడా సీరియస్‌నెస్ కోల్పోయింది. ముఖ్యంగా ల్యాండ్ మైన్ సీన్, డెలివరీ మధ్య యాక్షన్ వంటి అవాస్తవ దృశ్యాలు సినిమాకు నమ్మకాన్ని కోల్పోయేలా చేశాయి.
కొన్ని డైలాగులు, నిర్లక్ష్యంగా నిర్మించిన సన్నివేశాలు ప్రేక్షకుడిని కథలోకి లాక్కెళ్లే బదులు మరింత బోర్‌కి గురి చేశాయి. అజనీష్ సంగీతం పాటల్లో కొంత బాగుండగా, నేపథ్య సంగీతం అసలు ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఎడిటింగ్ లోపాలు కూడా స్పష్టంగా కనిపించాయి. తమ్ముడు అనే టైటిల్ కు తగినంత బలం కథలో లేకపోవడం సినిమా పెద్ద నెగటివ్. కుటుంబ భావోద్వేగాలను హైలైట్ చేయాల్సిన ఈ సినిమా, అవి తెరపై కనెక్ట్ అయ్యేలా చూపించలేకపోయింది. డైరెక్షన్, రైటింగ్ పరంగా ఈ సినిమా మరింత బలంగా ఉండాల్సింది.
ప్లస్ పాయింట్స్:
– నితిన్ యాక్షన్ సీన్లు ఆకట్టుకున్నాయి
– సౌరబ్ విలన్‌గా నెగటివ్ స్కోప్‌ను బాగా వాడుకున్నాడు
మైనస్ పాయింట్స్:
– కథ, కథనాల్లో బలహీనత
– ఎమోషనల్ డెప్త్ లోపం
– బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నిరాశకు గురిచేసింది
రేటింగ్: 2.25/5