
న్యూస్ డెస్క్: దేశవ్యాప్తంగా GST వసూళ్లు జూన్‌లో స్వల్పంగా తగ్గాయి. ఏప్రిల్, మే నెలల్లో వరుసగా ₹2 లక్షల కోట్లు దాటి రికార్డు సాధించిన కేంద్రం, జూన్‌లో మాత్రం రూ.1.85 లక్షల కోట్ల వసూలుతో కొంత వెనకడుగు వేసింది.
మొత్తంగా చూస్తే గత ఏడాది జూన్‌తో పోల్చితే ఈ ఏడాది వసూళ్లు 6.2 శాతం అధికంగా నమోదయ్యాయి. అయితే, ఏప్రిల్ నెలలో ₹2.37 లక్షల కోట్లు, మే నెలలో ₹2.01 లక్షల కోట్లు వసూలవడం వల్ల జూన్ తగ్గుదల కాస్త గమనించదగ్గ అంశంగా మారింది.
వచ్చే నెలల్లో మళ్లీ వసూళ్లు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వివిధ రంగాల్లో వినిమయం పెరిగే సమయంలో పన్నుల ఆదాయం పునరుద్ధరించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
జీఎస్టీ అమలుకు జూలై 1 నాటికి 8 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ, కేంద్రం గత ఐదేళ్లలో వసూళ్లు రెట్టింపు అయ్యాయని వెల్లడించింది.
2020-21లో ₹11.37 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం వసూళ్లు, 2024-25 నాటికి ₹20.08 లక్షల కోట్లకు చేరాయని వివరించారు.
