
న్యూస్ డెస్క్: రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వ్యక్తికే పదవి ఇవ్వడం దుర్మార్గమన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటనపై విచారణ కొనసాగుతోందని భట్టి తెలిపారు. న్యాయశాఖ పరంగా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే రోహిత్ వేముల చట్టం తీసుకురావాలని భావిస్తున్నట్టు చెప్పారు.
రోహిత్ మరణానికి బందారు దత్తాత్రేయ, రామచందర్ రావు, ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్‌లు కారణమవుతుంటే… వారికి పదవులు ఇవ్వడం సమాజానికి తలవంచే పని అని ఆయన మండిపడ్డారు.
దళితులు, ఆదివాసీలను అణగదొక్కే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. అట్టడుగు వర్గాల ప్రజలకు బీజేపీలో స్థానం లేదన్నారు. కేంద్రం తమ హక్కులను కాపాడాలని కోరారు.
కేసీఆర్‌పై కూడా భట్టి విరుచుకుపడ్డారు. రోహిత్ వేముల మరణించినప్పుడు కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమన్నారు.
యూనివర్సిటీల సంక్షేమంపై బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ దృష్టి పెట్టలేదని, బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా విద్యార్థి సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తేల్చిచెప్పారు.