
న్యూస్ డెస్క్: ప్రోగ్రామింగ్ రంగానికి కృత్రిమ మేధ (ఏఐ) ఎలాంటి ముప్పు కాదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వెల్లడించారు. వందేళ్ల పాటు ఈ రంగంలో ఉద్యోగ భద్రత ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ఏఐ మన స్థానాన్ని భర్తీ చేయదు. అది సహాయకుడిగా మాత్రమే ఉంటుంది” అని గేట్స్ చెప్పారు. ముఖ్యంగా డీబగ్గింగ్ వంటి బోరింగ్ పనుల్లో మాత్రమే ఇది ఉపయోగపడుతుందని అన్నారు.
కోడ్ రాయడం అంటే కేవలం టైప్ చేయడం కాదని, దానికి లోతైన ఆలోచన, సృజనాత్మకత అవసరమని ఆయన స్పష్టం చేశారు. యంత్రాలకు ఆ లక్షణాలు లేవని తెలిపారు.
ప్రోగ్రామింగ్‌కు అవసరమైన విచక్షణ, ఊహాశక్తి, పరిస్థితులకనుగుణంగా స్పందించే నైపుణ్యం ఏఐలో లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెల్లడించిన ఉద్యోగాల అంచనాలపై కూడా గేట్స్ స్పందించారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని కాదు, కొత్తగా కూడా వస్తాయని చెప్పారు. ఏఐను తెలివిగా వినియోగిస్తే మన ఉత్పాదకత పెరుగుతుందని గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.
