
న్యూస్ డెస్క్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన రాజీనామాపై స్పందిస్తూ హిందూ సమాజ సేవకు పూర్తిగా అంకితమయ్యానన్నారు. పదవుల కోసం ఈ నిర్ణయం తీసుకోలేదని, చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పని చేస్తానని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరినప్పుడు సేవాభావంతోనే అడుగుపెట్టానని రాజాసింగ్ గుర్తు చేశారు. ప్రజా సంక్షేమం, హిందూ హక్కుల పరిరక్షణే తన లక్ష్యమని పేర్కొన్నారు. బీజేపీ తనపై పెట్టిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు.
తనకు వరుసగా మూడు సార్లు గోషామహల్ టికెట్ ఇచ్చిన బీజేపీ అధిష్ఠానం నమ్మకాన్ని మరిచిపోలేనన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్న లక్షలాది కార్యకర్తల శ్రమను గుర్తు చేశారు.
రాజీనామా నిర్ణయం వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, అధికారం కోసమో కాదని స్పష్టంచేశారు. హిందుత్వం తన జీవన విధానమని చెప్పారు.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం ప్రయత్నిస్తానని, జాతీయవాద భావజాలంతో ముందుకెళ్తానని చెప్పారు. ప్రజా ఆశీస్సులు కోరారు. తుది శ్వాస వరకూ సమాజం కోసం పోరాటం కొనసాగుతుందని మరోసారి ధృవీకరించారు.