న్యూస్ డెస్క్: పాతబస్తీలోని సూరం చెరువు ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిర్మించిన ఫాతిమా కాలేజీపై వస్తున్న విమర్శలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు.
ఫాతిమా కాలేజీ అక్రమ నిర్మాణంగా గుర్తించి గతేడాది సెప్టెంబర్‌లోనే కూల్చే ప్రయత్నం చేశామని ఆయన తెలిపారు. కానీ అందులో 10,000 పేద ముస్లిం బాలికలు ఉచితంగా చదువుతున్న విషయం తెలుసుకుని మానవతా దృక్పథంతో ఆ నిర్ణయాన్ని నిలిపినట్టు వివరించారు.
ఈ విద్యాసంస్థ పేద మహిళలకు విద్య అందిస్తూ సమాజానికి సేవ చేస్తోందని పేర్కొన్నారు. అందుకే ఫాతిమా కాలేజీపై ప్రత్యేక దృష్టితో వ్యవహరించామని చెప్పారు.
ఇది ఎంఐఎం నేతలకు మినహాయింపు కాదని, ఇతర నేతల అక్రమ నిర్మాణాలపై కఠినంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రూ.1000 కోట్ల విలువైన ఎంఐఎం ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని, కార్పొరేటర్ల స్థలాలను కూడా రికవరీ చేశామని గుర్తు చేశారు.
ఫాతిమా కాలేజీపై మానవతా దృష్టితో వ్యవహరించామని, దీన్ని బలహీనతగా భావించవద్దని స్పష్టంచేశారు.
