
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న ది రాజా సాబ్ మూవీ చుట్టూ గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. బాలయ్య అఖండ 2 వాయిదా పడటంతో, రాజా సాబ్ కూడా సంక్రాంతికి వచ్చే అవకాశం లేదని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.
ఈ రూమర్స్ పై ప్రముఖ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. రాజా సాబ్ మేకింగ్‌కు తీసుకున్న ఫైనాన్స్ పూర్తిగా క్లియర్ అయిందని, వడ్డీలు కూడా అనుకున్నదాని కంటే ముందుగానే చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు.
విడుదలకు ముందే సినిమాలు ఆగిపోవడం, అది పరిశ్రమలోని వివిధ రంగాలపై చూపే ప్రభావం దురదృష్టకరమని విశ్వప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిత్రాల నిర్మాతలు తమ మూవీలను పెద్ద సినిమాల ప్రకారం ప్లాన్ చేసుకుని, ఇప్పుడు వేచి ఉండటం కలవరపెట్టిందని అన్నారు.
చివరి నిమిషంలో సినిమా విడుదలకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించడం చాలా దురదృష్టకరం అని, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండించాలని విశ్వప్రసాద్ తెలిపారు.
అంతరాయాలు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు సహా వేలాది మంది జీవనోపాధిని ప్రభావితం చేస్తాయని, బాధ్యతారహిత ప్రయత్నాలపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
రాజా సాబ్ తో పాటు సంక్రాంతికి వస్తున్న అన్ని చిత్రాలు ఇబ్బందులు లేకుండా విడుదల కావాలని, ఘన విజయం సాధించాలని విశ్వప్రసాద్ ఆకాంక్షించారు.
