
ఓట్ చోరీ ఆరోపణలపై ఈసీ స్పందన
న్యూస్ డెస్క్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఓటు చోరీ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. సీఈసీ గ్యానేష్ కుమార్ ఆదివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ముఖ్య వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఎలాంటి దుష్ప్రచారాలకు భయపడదని స్పష్టం చేశారు. ఏ పార్టీ అనుకూలం, ప్రతికూలం అనే తేడా లేకుండా తాము రాజ్యాంగబద్ధ సంస్థగా పని చేస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పక్షపాతం ఉండదని, ప్రతి ఓటరికి హక్కు వినియోగించేలా బూత్ స్థాయిలో ఏర్పాట్లు చేస్తామని వివరించారు.
రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను నేరుగా ప్రస్తావించకపోయినా, ఓటర్ల ఫొటోలు, పేర్లు బహిర్గతం చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన హెచ్చరించారు. “ఇతరుల ఓట్లు బయటపెడతారా? మీ కుటుంబ సభ్యుల ఓట్లను బయటపెట్టగలరా?” అంటూ ఆయన ప్రశ్నించారు.
సీఈసీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదని అన్నారు. నిజంగా ఎలాంటి సాక్ష్యాలు ఉంటే అఫిడవిట్ రూపంలో సమర్పించాలని సూచించారు. లేకపోతే అవి కేవలం దుష్ప్రచారాలుగానే పరిగణించబడతాయని తెలిపారు.
బీహార్ ఓటరు జాబితా సవరణను ప్రస్తావిస్తూ, దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన వారు తప్పనిసరిగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేయని వారికి ఓటు హక్కు ఎలా ఇస్తామని సీఈసీ ప్రశ్నించారు.
మొత్తానికి ఓటు చోరీ ఆరోపణలపై ఎన్నికల సంఘం గట్టి సమాధానం ఇచ్చినట్లే కనిపిస్తోంది. భవిష్యత్‌లో కూడా ఇలాంటి దుష్ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.