
న్యూస్ డెస్క్: తెలుగుదేశం పార్టీ తెలంగాణా యూనిట్‌కు కొత్త జీవం పోసే సమయం ఆసన్నమైంది. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అమరావతిలో తెలంగాణ టీడీపీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర, మండల స్థాయి కమిటీల నియామకం త్వరలోనే పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
సమావేశంలో నేతలు రాష్ట్ర అధ్యక్ష పదవిపై చర్చించగా, సమర్థత కలిగిన నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తామని చంద్రబాబు తెలిపారు. అయితే ఈ పదవికి దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని పరిగణనలోకి తీసుకుంటున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
నందమూరి వారసురాలు కావడంతో ఆమెకు ఈ బాధ్యత ఇవ్వడం ద్వారా పార్టీకి నూతన ఉత్సాహం రాబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలంగాణాలో టీడీపీ క్యాడర్ ఇంకా బలంగా ఉందని, గ్రామ స్థాయి నుంచి నాయకులు పార్టీ యాక్టివిటీలలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని నేతలు చంద్రబాబుకు వివరించారు. సుహాసిని ఇటీవల మంగళగిరి సమావేశానికి హాజరైన విషయం మరింత ఊహాగానాలకు దారితీసింది.
నందమూరి సుహాసినికి తెలంగాణా టీడీపీ అధ్యక్ష పదవి వస్తే, పార్టీకి కొత్త ఇమేజ్, కొత్త ఉత్సాహం రావచ్చని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.