
ఢిల్లీ: ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ఈ కుట్ర వెనుక ‘మేడమ్ సర్జన్’ అనే మహిళా డాక్టర్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ మాడ్యూల్, కేవలం ఢిల్లీనే కాకుండా, దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఏకకాలంలో దాడులకు ప్లాన్ చేసినట్లు తేలింది.
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలు, డిజిటల్ ఆధారాలను బట్టి, ఈ కుట్రకు 2021లోనే బీజం పడినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6 (బాబ్రీ మసీదు కూల్చివేత రోజు)ను టార్గెట్‌గా పెట్టుకుని, నాలుగు సంవత్సరాల క్రితమే బ్లూప్రింట్ సిద్ధం చేశారు.
ఈ ఉగ్ర నెట్‌వర్క్‌లో 43 ఏళ్ల డాక్టర్ షాహిన్ షాహిద్ అలియాస్ ‘మేడమ్ సర్జన్’ కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. జైషే మొహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ సంస్థలతో సంబంధాలున్న ఈమె, ఎర్రకోట పేలుడు నిందితుడు డాక్టర్ ఉమర్ నబీతో కలిసి పనిచేసినట్లు సమాచారం.
లక్నో జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీలో పనిచేసిన షాహిన్, 2015-16లోనే జైషే మొహమ్మద్‌లోకి ప్రవేశించింది. 2021 నుంచి దాడుల ప్రణాళికలో భాగమైంది. ఢిల్లీ, లక్నో, కాన్పూర్‌లలోని ఆమె 7 బ్యాంక్ అకౌంట్లను అధికారులు ఆడిట్ చేస్తున్నారు.
ఢిల్లీ పేలుడు తర్వాత డాక్టర్ షాహిన్ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. ఆమె కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నా, దర్యాప్తు కారణంగా వెరిఫికేషన్ ఆలస్యం కావడంతో ఆమె ప్లాన్ విఫలమైంది.
