
ఢిల్లీ: ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫరీదాబాద్‌లో అరెస్టయిన డాక్టర్ షాహిన్, విచారణలో దేశ భద్రతను కుదిపేసే కుట్రను అంగీకరించింది. పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ (JeM) నేతృత్వంలో రెండేళ్లుగా దేశవ్యాప్త దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె ఒప్పుకుంది.
ఈ టెర్రర్ మాడ్యూల్‌తో తనకు ప్రత్యక్ష సంబంధాలున్నాయని షాహిన్ తెలిపింది. డాక్టర్ ఉమర్, డాక్టర్ ముజమ్మిల్, ఆదిల్‌లతో కలిసి పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు, ఇందుకోసం అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను సేకరించినట్లు అంగీకరించింది.
ఈ కుట్రలో తన సోదరుడు పర్వేజ్ సయీద్ పాత్ర కూడా ఉందని, అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. పేలుడు పదార్థాలు సరఫరా చేసిన గుర్గావ్‌కు చెందిన వ్యక్తి వివరాలను కూడా ఆమె వెల్లడించింది.
అంతేకాకుండా, షాహిన్.. జైషే మొహమ్మద్ మహిళా విభాగమైన ‘జమాత్ ఉల్ మొమినాత్’లో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. JeM చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వంలోని ఈ విభాగంలో, షాహిన్ కొత్త నియామకాలు చేపట్టేదని సమాచారం.
మరోవైపు, ఢిల్లీ ఎర్రకోట పేలుడులో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు వాడి ఉండవచ్చని అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ ‘డాక్టర్ టెర్రరిజం’ నెట్‌వర్క్ చాలా విస్తృతమైందని, దర్యాప్తులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
