
ఏపీ: అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం అనూహ్య పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ప్రాంగణంలో మార్షల్స్ ప్రవర్తనపై మంత్రి నారా లోకేశ్ సీరియస్‌గా స్పందించారు. సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడుతుండగా మార్షల్స్ అతి ప్రదర్శించారని, చేతితో నెట్టారని ఆరోపణలు వచ్చాయి.
ఈ దృశ్యాన్ని తన చాంబర్ నుంచి గమనించిన మంత్రి లోకేశ్ వెంటనే బయటికొచ్చి మార్షల్స్‌ను నిలదీశారు. “ఇది తాడేపల్లి ప్యాలెస్ కాదు.. అసెంబ్లీ ప్రాంగణం. మీ పని ఎమ్మెల్యేలు, మీడియాను అడ్డుకోవడం కాదు. భద్రతను కాపాడడమే మీ బాధ్యత” అంటూ వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ అడ్డదారిలో పాలన కొనసాగించిన రోజులు ముగిశాయని, ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదని లోకేశ్ స్పష్టం చేశారు. మార్షల్స్ గీత దాటరాదని, ఇకపై ఇలాంటి ప్రవర్తన పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సభా సమావేశాల సమయంలో మార్షల్స్‌ను సాధారణంగా విపక్ష సభ్యులను బయటకు పంపడానికి మాత్రమే వినియోగిస్తారు. కానీ ప్రస్తుతం విపక్షం లేని పరిస్థితిలో వారికేమీ పెద్ద పనిలేకపోయినా, ఈ ఘటనతో వివాదం చెలరేగింది.
ఇక ధూళిపాళ్ల నరేంద్రకు గౌరవం ఇవ్వలేదన్న కారణంగా టీడీపీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ వ్యవహారంపై అసెంబ్లీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా చర్చలు సాగుతున్నాయి.
లోకేశ్ క్లాస్‌తో పాటు ఈ ఘటన మరోసారి అసెంబ్లీలో మార్షల్స్ పాత్ర, వారి హద్దులపై ప్రశ్నలు లేవనెత్తింది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరింత చర్చ జరుగనుందని తెలుస్తోంది.