
న్యూస్ డెస్క్: ప్రతిపక్షాల గట్టి నిరసనలు, నినాదాల మధ్యలోనే కేంద్ర ప్రభుత్వం రెండు కీలక ఆర్థిక బిల్లులను లోక్‌సభలో ఆమోదింపజేసుకుంది. వీటిలో ప్రధానంగా ఆదాయపు పన్ను బిల్లు-2025, పన్నుల చట్టాల (సవరణ) బిల్లు-2025 ఉన్నాయి. సభలో గందరగోళం నెలకొన్నప్పటికీ, మూజువాణి ఓటుతో ఈ బిల్లులు ఆమోదం పొందాయి.
సాయంత్రం సభ ప్రారంభమైన వెంటనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. అదే సమయంలో ప్రతిపక్ష సభ్యులు ఎన్నికల జాబితాల ప్రత్యేక సవరణ (SIR) పై నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. ఈ హడావుడి మధ్యనే స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యా రాయ్ ఓటింగ్ పూర్తి చేశారు.
ఆదాయపు పన్ను బిల్లు-2025, గత ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్న 1961 చట్టాన్ని రద్దు చేసి, కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తుంది. ఇందులో 285 సిఫార్సులను చేర్చారు. పన్నుల భాషను సరళతరం చేయడం, మినహాయింపులపై స్పష్టత ఇవ్వడం, గృహ రుణాలపై వడ్డీ తగ్గింపులు వంటి అంశాల్లో స్పష్టత కల్పించడం లక్ష్యం.
ఈ కొత్త చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. దీని ద్వారా పన్ను చెల్లింపుదారులపై ఉన్న సందిగ్ధతలు తగ్గి, ప్రక్రియ సులభం అవుతుందని ప్రభుత్వం పేర్కొంది.
పన్నుల చట్టాల (సవరణ) బిల్లులో కూడా పలు ముఖ్య మార్పులు ఉన్నాయి. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ సభ్యులకు, న్యూ పెన్షన్ స్కీమ్ తరహాలో పన్ను మినహాయింపులు అందించనున్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టే సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కు పన్ను ఉపశమనం కల్పించారు.
బిల్లులు ఆమోదం పొందిన తర్వాత కూడా ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు.