Tuesday, July 28, 2026
HomeNationalఉత్తరాఖండ్‌ లో వర్ష బీభత్సం: కొట్టుకుపోయిన గ్రామం

ఉత్తరాఖండ్‌ లో వర్ష బీభత్సం: కొట్టుకుపోయిన గ్రామం

uttarakhand-floods-village-washed-away-in-uttarkashi-cloudburst

న్యూస్ డెస్క్: ఉత్తరాఖండ్ రాష్ట్రం మరోసారి ప్రకృతి విలయతాండవాన్ని ఎదుర్కొంటోంది. ఉత్తరకాశీ జిల్లాలో మంగళవారం కుండపోత వర్షాలు కురవడంతో ధారాలీ వద్ద తీవ్ర భీభత్సం నెలకొంది. అక్కడి ఖీర్ గధ్ వాగులో అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరిగి, సమీప గ్రామం మొత్తం కొట్టుకుపోయినట్టు అధికారులు తెలిపారు.

అకస్మాత్తుగా పెరిగిన వరద ఉధృతితో గ్రామంలోని మార్కెట్ ప్రాంతం నీటమునిగింది. దీనివల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక దళం, సైన్యం రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. గ్రామంలో పలువురు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది.

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ప్రజల క్షేమం కోసం తాను నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నదుల వెంట తిరగవద్దని, వాగులు, వంకలు వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మిగతా ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రస్తుతానికి ఎలాంటి మృతదేహాలు గుర్తించబడలేదని అధికారులు తెలిపారు.

ఇండియా మేటిరియలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ) ఇప్పటికే ఆగస్టు 4 నుంచి భారీ వర్షాలు పడనున్నట్టు హెచ్చరించింది. డెహ్రాడూన్ జిల్లా యంత్రాంగం స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించగా, సీఎం ధామి అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.

అయినప్పటికీ ప్రకృతి ప్రభావం ఇంత తీవ్రంగా ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, పూర్తి స్థాయి పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular