న్యూస్ డెస్క్: ఇంగ్లండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు చూపించిన ప్రదర్శనకు ప్రపంచవ్యాప్తంగా నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్, నాయకత్వంతో అందరినీ ఆకట్టుకున్నాడు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా గిల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.
“గిల్ నిజంగా అద్భుతంగా ఆడాడు. టీమిండియాను తన భుజాలపై మోశాడు. ఇది నమ్మశక్యం కాని ప్రదర్శన,” అంటూ కనేరియా సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో గిల్ 754 పరుగులు చేయడం విశేషం. 75.4 సగటుతో పరుగులు చేసిన అతడు ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో జంట సెంచరీలతో సంచలనం సృష్టించాడు.
అక్కడ ఒక్క మ్యాచ్‌లోనే అతడు 430 పరుగులు సాధించాడు. ఇది టెస్ట్ చరిత్రలో రెండో అత్యధిక వ్యక్తిగత మ్యాచు స్కోరు. దీనికి ముందు 1990లో గ్రాహం గూచ్ చేసిన 456 పరుగులే టాప్ స్థానంలో ఉన్నాయి. గిల్ ఆట తీరుతో పాటు, అతడి స్థిరత్వం అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి.
గిల్ తన నాయకత్వంలోని సైన్యాన్ని సమర్థంగా నడిపాడు. దూకుడుగా కాకుండా, వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటూ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ముఖ్యంగా జడేజాతో కలిసి భారీ భాగస్వామ్యాలను నెలకొల్పిన విధానం ప్రాశంసనీయమైనది.
ఇంగ్లండ్‌తో సిరీస్‌ను 2-2తో ముగించిన తర్వాత గిల్ పై మరింత నమ్మకం పెరిగింది. అతని ఆట తీరు, కెప్టెన్సీ అనేకమందికి ప్రేరణగా నిలిచాయి. బీసీసీఐ సైతం “గిల్ శకం మొదలైంది” అంటూ ట్వీట్ చేసింది. ఈ ప్రదర్శనతో శుభ్‌మన్ గిల్, భారత క్రికెట్‌ను ముందుకు నడిపించే నాయకుడిగా తన స్థానాన్ని పదిలపరచుకున్నాడు.
