
న్యూస్ డెస్క్: మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల మరణించారు. ఈ అంత్యక్రియలకు కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. కానీ, కల్వకుంట్ల కవిత మాత్రం హాజరుకాలేదు. ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ విమర్శల నేపథ్యంలో, కవిత గురువారం సడెన్‌గా కోకాపేట్‌లోని హరీష్ రావు నివాసానికి వెళ్లారు. భర్త అనిల్‌తో కలిసి, సత్యనారాయణ రావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ ఊహించని పరామర్శ బీఆర్ఎస్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ఇటీవల కవిత, హరీష్ రావుల మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. కాలేశ్వరం వ్యవహారంలో హరీష్ పేరును, సంతోష్ రావు “టానిక్” విషయాన్ని కవిత ప్రస్తావించడం వీరి మధ్య దూరం పెంచింది.
ఇంతటి విభేదాల తర్వాత కవిత పరామర్శకు వెళ్లడం సంచలనంగా మారింది. అయితే, హరీష్ రావు మాత్రం ఈ సానుభూతికి పెద్దగా చలించలేదని, కేవలం మర్యాదపూర్వకంగానే స్పందించారని సమాచారం.
కవిత నమస్కారం చేయగా, హరీష్ ప్రతినమస్కారం చేసినట్లు తెలుస్తోంది. ఆమె పెద్దగా సంభాషణలు చేయకుండా, నివాళులర్పించి, కొద్దిసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
పాత పగలు పక్కనపెట్టి కవిత ఈ పరామర్శకు వెళ్లడం, హరీష్ తటస్థంగా స్పందించడం.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీస్తుందా అనే చర్చ మొదలైంది. వీరి అడుగులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
