
ఏపీ: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. మొంథా తుఫాను సృష్టించిన నష్టాన్ని పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు కోనసీమలో పర్యటించగా, పవన్ గురువారం కృష్ణా జిల్లాలోని తుఫాన్ ప్రభావిత దివిసీమ (అవనిగడ్డ)కు వెళ్లారు.
స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా నష్టం వివరాలు తెలుసుకున్న ఆయన, నేరుగా రైతుల వద్దకే వెళ్లారు. కోడూరు మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ఆయన వెనుకాడలేదు. మోకాలి లోతు బురద నీటిలో నడుస్తూ, నీట మునిగిన వరి, అరటి తోటలను స్వయంగా పరిశీలించారు.
చేతికొచ్చిన పంట మొత్తం నీటిలో మునిగి కుళ్లిపోతోందని, ముఖ్యంగా కౌలు రైతులు సర్వస్వం కోల్పోయామని రైతులు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలన్నీ ఓపికగా విన్న పవన్, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని గట్టి భరోసా ఇచ్చారు.
ఆయన పర్యటన ఏమాత్రం హంగామా లేకుండా, “సినిమా షో”లా కాకుండా వాస్తవికతకు దగ్గరగా సాగింది. ఓ నాయకుడు నేరుగా బురదలోకి దిగి తమ కష్టాలు వినడం రైతులను ఆకట్టుకుంది.
తిరుగు ప్రయాణంలో పులిగడ్డ వద్ద రోడ్డు పక్కన చిన్న వ్యాపారులను పలకరించిన పవన్, తుఫాను వల్ల వారి జీవనోపాధికి కలిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.
సమస్యల పరిష్కారం కోసం అక్కడికక్కడే జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు పవన్ తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఆయన చొరవ, క్షేత్రస్థాయిలో పర్యటించిన తీరు ప్రజలను ఆకట్టుకుంది.
