
న్యూస్ డెస్క్: ‘మొంథా‘ తుఫాను ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం, రాష్ట్రానికి సుమారు రూ. 5,265 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇందులో రహదారుల (ఆర్‌అండ్‌బీ) రంగానికి రూ. 2,079 కోట్లు, ఆక్వా రంగానికి రూ. 1,270 కోట్లు, వ్యవసాయానికి రూ. 829 కోట్లు నష్టం వాటిల్లింది.
ముందస్తు చర్యల వల్ల ప్రాణ నష్టం జరగలేదని, జియో-ట్యాగింగ్ ద్వారా సహాయక చర్యలు పర్యవేక్షించామని చంద్రబాబు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించి, నీట మునిగిన వరి, అరటి తోటలను పరిశీలించారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లేవారికి రూ. 3,000 ఆర్థిక సాయం, ఉచిత బియ్యం అందిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. పంట నష్టంపై ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.
అయితే, నష్టంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ భిన్నమైన లెక్కలు చెప్పారు. రాష్ట్రంలో 25 జిల్లాలు ప్రభావితమయ్యాయని, ఏకంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు (11 లక్షల ఎకరాల్లో వరి) దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు.
ఈ తుఫాను ప్రభావం తెలంగాణపైనా తీవ్రంగా పడింది. సిద్దిపేట, హుస్నాబాద్ ప్రాంతాల్లో వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిస్థితిని సమీక్షించి, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.
తెలంగాణలో సుమారు 230 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. శాశ్వత పునరుద్ధరణకు రూ. 225 కోట్లు అవసరమని అంచనా వేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
