
న్యూస్ డెస్క్: ‘మొంథా’ తుఫాను ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసింది, కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని పెను విపత్తుగా అభివర్ణించారు. భారీ వర్షాలకు చేతికొచ్చిన పంట నీట మునిగి, మౌలిక వసతులు ధ్వంసం కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తుఫాను తీరం దాటిన వెంటనే సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఎటు చూసినా నీట మునిగిన పొలాలే కనిపించాయి. క్షేత్రస్థాయిలో రైతులను పలకరించిన ఆయన, వారి వేదన చూసి చలించిపోయారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం, 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. ఇందులో 59 వేల హెక్టార్లకు పైగా వరి పంట ఉండటం గమనార్హం. ఈ విపత్తు వల్ల దాదాపు 79 వేల మంది రైతులు నష్టపోయారని సీఎం తెలిపారు.
అయితే ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని, క్షేత్రస్థాయిలో నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. నష్టాన్ని త్వరగా అంచనా వేసి, వీలైనంత త్వరగా కేంద్రానికి నివేదిక పంపాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
గత తుఫాన్ల అనుభవాలతో పోలిస్తే, ఈసారి కేంద్రం ఉదారంగా సాయం చేస్తుందని ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబుకు ఫోన్ చేసి, అండగా ఉంటామని హామీ ఇవ్వడమే ఈ ఆశలకు కారణం.
కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ సాయం రాబట్టి, రైతులకు తక్షణ ఉపశమనం అందించాలని సీఎం భావిస్తున్నారు. హుదూద్, తిత్లీ తర్వాత ఏపీని తాకిన మరో తీవ్ర తుఫానుగా ‘మొంథా’ మిగిలిపోనుంది.
