
న్యూస్ డెస్క్: IND vs AUS: ఆసీస్‌పై అద్భుత విజయం.. రికార్డులన్నీ బద్దలు కొట్టిన టీమిండియా! భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అమన్‌జీత్ కౌర్ విన్నింగ్ బౌండరీ కొట్టగానే భారత శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఈ గెలుపు, ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికాకు గట్టి హెచ్చరిక పంపింది.
ఈ క్రమంలో మన అమ్మాయిలు పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టారు. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధిక విజయవంతమైన ఛేజింగ్. ఇదే టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా (331) తమపై నెలకొల్పిన రికార్డును భారత్ ఇప్పుడు తిరగరాసింది.
అంతేకాదు, వన్డే ప్రపంచ కప్ (పురుషుల/మహిళల) నాకౌట్ చరిత్రలో 300కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఇరు జట్లు కలిసి మొత్తం 679 పరుగులు చేశాయి. ఇది కూడా మహిళల ప్రపంచ కప్‌లో అత్యధిక మ్యాచ్ అగ్రిగేట్ స్కోరు. ఈ మ్యాచ్‌లో నమోదైన 14 సిక్స్‌లు (భారత్ 5, ఆసీస్ 9) కూడా ఓ ప్రపంచ రికార్డే.
భారత జట్టు వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి (2005, 2017 తర్వాత). అలాగే, సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించడం ఇది రెండోసారి.
ఆస్ట్రేలియా ఓడిపోయినా, వారి ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (119) 22 ఏళ్లకే నాకౌట్ సెంచరీ చేసి, ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది.
