
న్యూస్ డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేరుగా ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్‌తోనే తలపడతారా అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. జన్ సురాజ్ పార్టీ విడుదల చేసిన 51 మంది అభ్యర్థుల తొలి జాబితాలో ప్రశాంత్ కిశోర్ పేరు లేకపోవడమే దీనికి కారణం. గతంలో ఆయన కరహగర్ లేదా తేజస్వి యాదవ్ స్థానమైన రాఘోపూర్ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి.
తాజా జాబితాలో కరహగర్ నియోజకవర్గం నుంచి రితేష్ రంజన్‌ను ప్రకటించడంతో, ప్రశాంత్ కిశోర్ దృష్టి ఇప్పుడు రాఘోపూర్పైనే ఉందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం జన సురాజ్ పార్టీ ఈ మొదటి జాబితాను గురువారం మధ్యాహ్నం ప్రకటించింది.
ఈ తొలి జాబితాలో కేవలం రాజకీయ నాయకులే కాకుండా, రిటైర్డ్ పోలీసు అధికారులు, వైద్యులు, మాజీ ఉన్నతాధికారులు ఉండటం విశేషం. ఉదాహరణకు, కుమ్రార్ నియోజకవర్గం నుంచి పాట్నా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేసిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త కేసీ సిన్హాకు టికెట్ ఇచ్చారు. అలాగే, పాట్నా హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ వైబీ గిరిని మంఝీ నుంచి బరిలోకి దించారు.
పాట్నా మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి డాక్టర్ అమిత్ కుమార్ దాస్‌కు ముజఫర్‌పూర్ టికెట్ దక్కింది. గ్రామీణ ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఈ జాబితాలో 16 శాతం మంది ముస్లింలకు, 17 శాతం మంది అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన వారికి అవకాశం కల్పించారు.
ప్రశాంత్ కిశోర్ ఈ జాబితాను ప్రకటించడం వెనుక ఉన్న లక్ష్యం స్పష్టం. రాజకీయాల్లో అవినీతిని రూపుమాపడమే ధ్యేయంగా, సమాజంలో మంచి పేరున్న, విద్యావంతులు, నిపుణులను బరిలోకి దించడం ద్వారా బీహార్ రాజకీయాల్లో సరికొత్త ప్రయోగానికి తెరలేపారు.
