న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ యువతకు మంత్రి నారా లోకేశ్ మరో శుభవార్త అందించారు. గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, ఇకపై ప్రతి సంవత్సరం డీఎస్సీ (డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ) పరీక్ష నిర్వహణకు ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే కొత్త టీచర్లు విధుల్లో చేరేలా ప్లాన్ సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం, వచ్చే నెలలోనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, మార్చిలో పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వేగవంతమైన నిర్ణయంతో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు మరో గొప్ప అవకాశం దొరికింది.
మొదటి మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ కొలిక్కి వస్తున్న సమయంలోనే, రెండో డీఎస్సీపై మంత్రి ప్రకటన చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. గత డీఎస్సీలో కేవలం త్రుటిలో అవకాశం కోల్పోయిన అభ్యర్థులు, రాబోయే పరీక్ష కోసం మరింత ఉత్సాహంగా ప్రిపేర్ అయ్యే అవకాశం దక్కింది. నిరుద్యోగుల్లో ఎలాంటి నిరుత్సాహం కలగకుండా వెంటవెంటనే డీఎస్సీలు నిర్వహించడంపై ప్రభుత్వం సానుకూలతను పెంచుతుందని అంటున్నారు.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చంద్రబాబు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందనడానికి తాజా నిర్ణయం మరోసారి రుజువైంది. గత ఐదేళ్లలో కేవలం ఒక డీఎస్సీ కూడా లేకపోవడం వలన చాలా మంది నిరుద్యోగులు సమయం వృథా చేసుకోవాల్సి వచ్చింది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన నాణ్యతను పెంచడం కోసం, టీచర్ పోస్టులు ఖాళీగా లేకుండా చూడాలని లోకేశ్ నిర్ణయం తీసుకున్నారు. నాణ్యమైన విద్యాబోధనకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఆశించే టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యమివ్వాలని మంత్రి నిర్ణయించారు.
దీనిలో భాగంగా గురువారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి లోకేశ్ ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల మెగా డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులను కేవలం 150 రోజుల్లోనే పూర్తి చేసి ప్రభుత్వం నిరుద్యోగుల్లో నమ్మకం కల్పించింది.
