
న్యూస్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) విలువ పడిపోవడం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. వరుసగా రెండో ఏడాది కూడా ఈ క్యాష్ రిచ్ లీగ్ విలువ 10 బిలియన్ డాలర్ల లోపునకు తగ్గింది. ప్రస్తుతం ఐపీఎల్ విలువ 8.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 76,100 కోట్లు) మాత్రమే. రెండేళ్ల కిందట 11.2 బిలియన్ డాలర్లుగా ఉన్న విలువ ఇప్పుడు 2.4 బిలియన్ డాలర్లు తగ్గింది.
ఐపీఎల్ అంటే సక్సెస్‌కు పర్యాయపదం అయినప్పటికీ, ఇప్పుడు దానికి ఇలా జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ డీ అండ్ పీ అడ్వైజరీ వాల్యుయేషన్ రిపోర్ట్ ఈ వివరాలను వెల్లడించింది. ఐపీఎల్ సక్సెస్‌ను చూసి ప్రపంచంలో ఎన్నో లీగ్‌లు వచ్చినా, ఒక్కటి కూడా దీని స్థాయికి చేరలేకపోయింది.
ఐపీఎల్ విలువ పతనానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నట్లు నివేదిక చెబుతోంది. మొదటిది, మీడియా హక్కుల కోసం పోటీ తగ్గడం. రెండోది, ఆన్‌లైన్ మనీ గేమింగ్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధమే ఈ పతనానికి మూల కారణాలు.
ఈ ఏడాది జరిగిన 18వ సీజన్‌లో ఐపీఎల్ స్ట్రీమింగ్ ప్రసార హక్కులు కలిగిన జియో హాట్‌స్టార్ ఏకంగా రూ. 4,500 కోట్లు ఆర్జించింది. ఈ మొత్తం అంతా అడ్వర్టైజ్‌మెంట్ సొమ్ము నుంచే వచ్చింది. అయినప్పటికీ బ్రాండ్ వాల్యూ తగ్గడం గమనార్హం.
లీగ్ బ్రాండ్ వాల్యూ అత్యధికంగా ఉన్న ఫ్రాంచైజీగా ఈ ఏడాది తొలిసారి చాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) నిలిచింది. ముంబై ఇండియన్స్ (ఎంఐ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఐపీఎల్ తో పాటే మహిళలకు నిర్వహిస్తున్న ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) విలువ కూడా 2024లో రూ. 1,350 కోట్ల నుంచి ఈ ఏడాది రూ. 1,275 కోట్లకు తగ్గింది.
