
న్యూస్ డెస్క్: ప్రముఖ ఇ కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి భారీ తొలగింపులకు సిద్ధమవుతోంది. అంతర్గతంగా ‘పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ (పీఎక్స్‌టీ)’ బృందంగా పిలువబడే మానవ వనరుల (హెచ్ఆర్) విభాగంలో సుమారు 15 శాతం వరకు సిబ్బందిని తగ్గించేందుకు కంపెనీ ప్రణాళికలు వేస్తున్నట్లు ఫార్చ్యూన్ పత్రిక కథనం వెల్లడించింది.
దీనిపై అమెజాన్ ప్రతినిధి స్పందించడానికి నిరాకరించినప్పటికీ, ఈ భారీ లేఆఫ్‌లు ఉద్యోగుల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.
ఈ తాజా తొలగింపుల ప్రకటన ఓ వైపు ఉండగా, మరోవైపు అమెజాన్ సీజనల్ ఉద్యోగుల నియామకాలను వేగవంతం చేస్తోంది. పండుగ సీజన్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని యూఎస్‌లోని గిడ్డంగులు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో సుమారు 2,50,000 మంది సీజనల్ ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రణాళికలు ప్రకటించింది.
అమెజాన్ సీఈవో యాండీ జెస్సీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కంపెనీలో పునరుద్ధరణ చర్యల్లో భాగంగా లేఆఫ్‌ల పర్వం కొనసాగుతోంది. 2022-23 మధ్యకాలంలో ఈ సంస్థ ఏకంగా 27 వేల మంది ఉద్యోగులను తొలగించింది. తాజా తొలగింపులు ఎప్పటినుంచి ఉంటాయి, ఇంకా ఏఏ విభాగాలపై ప్రభావం ఉంటుంది అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
అమెజాన్ సీఈవో యాండీ జెస్సీ ప్రస్తుతం ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శకం అని తరచుగా చెబుతున్నారు. ప్రతి ఉద్యోగి ఏఐని అందిపుచ్చుకోవాలని, ఏఐ సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా మెరుగైన సేవలు అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలోనే ఏఐను విస్తృతం చేయడం ద్వారా ఉద్యోగులను కోల్పోవాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా ఆయన గతంలో ప్రస్తావించారు. ఏఐ, క్లౌడ్ కార్యకలాపాలకు అమెజాన్ ఇటీవల బిలియన్ డాలర్లు కుమ్మరిస్తోంది. ఈ ఏడాది వర్కింగ్ క్యాపిటల్ పెట్టుబడుల్లో భాగంగా 100 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయాలని నిర్ణయించింది.
