
న్యూస్ డెస్క్: ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (AIIB) నుంచి పాకిస్థాన్‌కు అందిన భారీ ఆర్థిక సహాయం భారత భద్రతా వర్గాలలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. $235 మిలియన్ల (దాదాపు ₹1,950 కోట్లు) ఈ సాయం ఉగ్ర కార్యకలాపాలకు మళ్లించబడే అవకాశం ఉందని భద్రతా వర్గాలు భయపడుతున్నాయి. ఈ పరిణామం ప్రాంతీయ స్థిరత్వానికి సవాలుగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
AIIB సాయం ప్రకటన వెలువడిన ప్రస్తుత సమయంలోనే, సరిహద్దుల వద్ద పాకిస్థాన్ కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో భారత ఆర్మీ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలను పాకిస్థాన్ తిరిగి నిర్మిస్తోందన్న వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వెస్టర్న్ ఆర్మీ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ మాట్లాడుతూ, పాకిస్థాన్ పహల్గామ్ తరహా మరో దాడికి కుట్ర పన్నుతోందని స్పష్టం చేశారు. అయితే, భారత ఆర్మీ ఈ తరహా పరిస్థితులను ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్ సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేస్తోంది.
వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఏఐఐబీ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి గతంలో అందిన ఆర్థిక సాయం ఉగ్రస్థావరాల నిర్మాణం, ఇతర ఉగ్ర కార్యకలాపాలకు మళ్లించబడిన సందర్భాలు అనేకసార్లు వెల్లడయ్యాయి. పాకిస్థాన్ గత చరిత్రే ఈ ఆందోళనకు ప్రధాన కారణం.
AIIB ఈ నిధులను లాహోర్ వాటర్ అండ్ వాచ్ వాటర్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా లాహోర్ నగరంలో శుభ్రమైన తాగునీరు అందించడం, మురుగునీటి లీకేజీ సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను లాహోర్ వాటర్ అండ్ శానిటేషన్ ఏజెన్సీ (WASA), చైనాకు చెందిన ఒక సంస్థ సంయుక్తంగా చేపట్టనున్నాయి. AIIB ఈ మొత్తాన్ని పాకిస్థాన్‌కు విడతల వారీగా అందించనుంది.
