
న్యూస్ డెస్క్: మహిళలకు అత్యంత ప్రీతికరమైన ఆభరణం బంగారం. అయితే ఇప్పుడు బంగారం ధరలు సామాన్యులను వణికిస్తున్నాయి. గత పది రోజులుగా నిరంతరంగా పెరుగుతున్న బంగారం రేట్లు సెప్టెంబర్ 4న ఆల్‌టైమ్ రికార్డును తాకాయి.
హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,980కి చేరగా, 22 క్యారెట్ల ధర రూ.98,060 వద్ద నిలిచింది. ఢిల్లీలో మాత్రం ధర మరింత ఎక్కువగా రూ.1,07,130 పలికింది. ముంబై, కోల్‌కతా, బెంగళూరులలో కూడా దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతోంది.
పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడం, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే క్షీణించడం బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు. అంతేకాకుండా అంతర్జాతీయంగా కూడా బంగారంపై డిమాండ్ పెరగడం రేట్లపై ప్రభావం చూపుతోంది.
బంగారం మాత్రమే కాదు, వెండి ధరలు కూడా పెరిగాయి. విజయవాడ, హైదరాబాద్, చెన్నైలో కేజీ వెండి ధర రూ.1,37,100 చేరుకుంది.
ప్రస్తుతం బంగారం పెట్టుబడిదారులకు లాభాలను ఇస్తున్నా, కొనుగోలు చేయదలచిన సాధారణ ప్రజలకు మాత్రం భారంగా మారింది.