
ఏపీ: హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కొత్త చట్టం తీసుకురానున్నామని వెల్లడించారు. ఈ బిల్లు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశముందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా పరిగణిస్తున్నారని ఆమె చెప్పారు.
విదేశాల్లో ఉంటూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసే వారినీ వదిలిపెట్టేది లేదని అనిత హెచ్చరించారు. సోషల్ మీడియా ఫేక్ ప్రచారం రాష్ట్రానికి పెద్ద తలనొప్పిగా మారిందని పేర్కొన్నారు. గతంలో కేసులు పెట్టినా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అడ్డుగా మారాయని గుర్తు చేశారు.
ఆర్నేష్ కుమార్ తీర్పు ప్రకారం నోటీసులు ఇవ్వడం, తర్వాత స్టేషన్ బెయిల్ ఇవ్వడం తప్పనిసరి అవ్వడంతో, సోషల్ మీడియాలో రెచ్చిపోయే వారిని కట్టడి చేయడం కష్టమైందని తెలిపారు.
అందుకే ఇప్పుడు కొత్త చట్టం ద్వారానే సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో ఉంటూ తప్పుడు ప్రచారం చేసే వారిని నియంత్రించడానికి కొత్త నిబంధనలు తీసుకురానున్నట్టు సమాచారం.
ప్రాంతాలు, సమూహాల మధ్య వైషమ్యాలు పెంచేలా ఫేక్ ప్రచారం జరుగుతోందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కొత్త చట్టం ద్వారా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని అనిత స్పష్టం చేశారు.