
న్యూస్ డెస్క్: మొదటిసారి రుణం కోసం ప్రయత్నించే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం సిబిల్ స్కోర్ (క్రెడిట్ స్కోర్) లేదని బ్యాంకులు వారి దరఖాస్తులను తిరస్కరించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో ఈ విషయాన్ని వెల్లడించారు.
రుణాల మంజూరులో కనీస సిబిల్ స్కోర్ అనే షరతు లేదని ఆర్‌బీఐ ఇప్పటికే చెప్పిందని మంత్రి తెలిపారు. కొత్తగా రుణం కోరేవారికి క్రెడిట్ హిస్టరీ ఉండదనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని బ్యాంకులకు సూచించారు.
సిబిల్ స్కోర్ లేకపోయినా రుణం ఇస్తున్న బ్యాంకులు, అభ్యర్థి ఆర్థిక స్థితి, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. గత రుణాల చెల్లింపులు, సెటిల్‌మెంట్లు, రైట్-ఆఫ్‌లు వంటి వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు.
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ఒక వ్యక్తి రిపోర్ట్ ఇవ్వడానికి గరిష్టంగా రూ.100 మాత్రమే వసూలు చేయగలవని, అదనంగా ప్రతి సంవత్సరం ఒక ఉచిత రిపోర్ట్ ఇవ్వడం తప్పనిసరని గుర్తు చేశారు.
ఈ నిర్ణయం వల్ల కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు, యువత, మధ్యతరగతి కుటుంబాలు లాభం పొందనున్నారు. ఇకపై సిబిల్ స్కోర్ లేకపోవడం వల్ల రుణం తిరస్కరించబడే సమస్య తలెత్తదని స్పష్టమైంది.