
దేశంలో ప్రతి వ్యక్తికి లక్షకు పైగా అప్పు ఉందని కేంద్రం వెల్లడి
న్యూస్ డెస్క్: దేశ జనాభా లెక్కలు చూస్తే ప్రస్తుతం 142 కోట్లకు పైగానే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో ప్రతి ఒక్కరిపై సగటున రూ. 1.32 లక్షల అప్పు ఉందని వెల్లడించింది.
ఇది ప్రజలు వ్యక్తిగతంగా తీసుకున్న రుణాలు కాదు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తీసుకున్న అప్పులను చూస్తే, ఒక్కొక్కరి తలపైన ఈ మొత్తంలో అప్పు ఉన్నట్లు చెప్పింది.
2014 నుంచి కేంద్రం చేసిన అప్పులు, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ పంచితే ఒక్కొక్కరికి ఈ మొత్తంలో అప్పు వస్తుందని తెలిపింది. అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకున్నామని వివరించింది. రాష్ట్రాలకూ ఈ సొమ్ములో భాగం ఇచ్చామని చెప్పింది.
అప్పు మీద చెల్లిస్తున్న వడ్డీల వివరాలు కూడా వెల్లడించాయి. 2022-23లో రూ. 9.3 లక్షల కోట్లు, 2023-24లో రూ. 10.64 లక్షల కోట్లు, 2024-25లో రూ. 11.18 లక్షల కోట్లు వడ్డీ కట్టినట్టు తెలిపింది.
ప్రస్తుతం జీడీపీతో పోల్చితే అప్పు 62 శాతంగా ఉందని, 2031లో ఈ మొత్తాన్ని 50 శాతానికి తగ్గించే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని తెలిపింది. అభివృద్ధి కోసం అప్పులు చేయడం తప్పు కాదని కేంద్రం పేర్కొంది.
