
తెలంగాణ: కేబినెట్ విస్తరణ చర్చలు వేగంగా జరుగుతున్న వేళ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మంత్రి పదవిపై దృష్టి సారించారు. ఈ మేరకు ఆయన ఈరోజు ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అధిష్టానాన్ని కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరనున్నట్టు సమాచారం.
ఢిల్లీకి వెళ్లే ముందు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, మంత్రి పదవి విషయంలో తాను ఆశలు పెట్టుకున్నట్లు ప్రత్యక్షంగా వెల్లడించలేదు. అయితే, నిర్ణయం పూర్తిగా పార్టీ అధిష్టానానిదేనని చెప్పారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన దానం, సీఎం రేవంత్ విసిరిన సవాల్‌ను కేటీఆర్ స్వీకరించాలని సూచించారు. బీజేపీపై కూడా విమర్శలు గుప్పించారు.
బీసీ నేతల ఆకాంక్షలను బీజేపీ పట్టించుకోవడం లేదని ఆరోపించిన దానం, కేంద్రం పసుపు బోర్డు ప్రకటించినా కార్యాలయం కూడా పెట్టలేదని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రి పదవులలో బీసీలకు అవకాశం రావాలని కోరుతున్న నేపథ్యంలో దానం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం పెరిగింది. అధిష్టానం నిర్ణయం కోసం కాంగ్రెస్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.