న్యూస్ డెస్క్: కేరళలో మళ్లీ ప్రాణాంతక నిఫా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. మలప్పురం జిల్లాలో ఓ 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని నిఫా వల్ల మృతి చెందగా, పాలక్కాడ్‌కు చెందిన మహిళకు వైరస్ సోకినట్లు తేలింది.
జూలై 1న జ్వరం, వాంతులతో బాధపడుతూ కోజికోడ్ ఆసుపత్రిలో చేరిన విద్యార్థిని, చికిత్స పొందుతూ మరణించింది. ఆమెకు చికిత్స చేసిన వైద్య సిబ్బందిలో 43 మందిని ప్రభుత్వం ఇప్పటికే క్వారంటైన్‌కు తరలించింది.
ఇక పాలక్కాడ్‌కు చెందిన 39 ఏళ్ల మహిళకు కూడా నిఫా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిద్దరి నమూనాలను పూణే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరీక్షించి నివేదికను విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్, మలప్పురం, కోజికోడ్, పాలక్కాడ్ జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. అవసరమైనన్ని ఆసుపత్రుల్లో ఐసోలేషన్ బెడ్స్ సిద్ధం చేసినట్లు తెలిపారు.
నిఫా అనేది గబ్బిలాలు, పందుల నుంచి మనుషులకు సోకే వైరల్ వ్యాధి. ఇది తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్, మెదడు వాపుతో మరణించే ప్రమాదాన్ని కలిగిస్తుంది.
ప్రస్తుతం నియంత్రణ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
