న్యూస్ డెస్క్: అమెరికాతో వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలకు మోదీ తలొగ్గుతారని, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవడం తప్ప చేయలేరని విమర్శించారు.
“నా మాట రాసిపెట్టుకోండి… ట్రంప్ గెలుస్తారు, మోదీ ఒప్పందానికి ఓకే చెబుతారు” అంటూ రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందం కుదరాలంటే భారత రైతులపై భారంగా మారే అంగీకారాలు మోదీ ప్రభుత్వం ఇస్తుందని ఆయన ఆరోపించారు.
దీనిపై స్పందించిన పీయూష్ గోయల్, భారత్ అంతర్జాతీయ ఒప్పందాల్లో బలమైన ధోరణిని అనుసరిస్తోందని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ ఒప్పందానికీ వెళ్లబోమని చెప్పారు.
వస్త్రాలు, ఆభరణాలు, మత్స్య ఉత్పత్తులపై మినహాయింపు కోరుతున్న భారత్‌కి.. ఎలక్ట్రిక్ వాహనాలు, పాడి ఉత్పత్తులపై సుంకాల కోతతో అమెరికా ఎదురుదాడి చేస్తోంది.
దేశీయ వ్యవసాయ రంగానికి ముప్పుగా మారే ఆడిమాండ్లను భారత్ తిరస్కరిస్తోంది. జులై 9కు ముందే ఓ మధ్యంతర ఒప్పందానికి అవకాశం ఉందని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి.
