
న్యూస్ డెస్క్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీల్లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడానికి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసియా కప్ 2025 జట్టును ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ ప్రకటన రావడం చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలోని సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీలో రెండు పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఈ కమిటీలో అగార్కర్‌తో పాటు ఎస్ఎస్ దాస్, సుబ్రతో బెనర్జీ, అజయ్ రాత్రా, ఎస్. శరత్ సభ్యులుగా ఉన్నారు. కాంట్రాక్టులు ఏటా పునరుద్ధరిస్తామని, త్వరలో ఎవరి స్థానంలో కొత్త సెలక్టర్లు వస్తారనే విషయంపై స్పష్టత ఇస్తామని బీసీసీఐ తెలిపింది.
సెలక్టర్ల అర్హతలో ఎలాంటి మార్పులు లేవు. కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వారు దరఖాస్తు చేయొచ్చు. అలాగే 10 వన్డేలు లేదా 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వారు కూడా అర్హులే. ఈ నిబంధనలు యధాతధంగా కొనసాగనున్నాయి.
మహిళల జాతీయ సెలక్షన్ కమిటీలో కూడా పెద్దఎత్తున మార్పులు జరుగుతున్నాయి. నీతూ డేవిడ్ నేతృత్వంలోని ఈ కమిటీలో 4 పోస్టులు ఖాళీగా ఉండటంతో వాటికి దరఖాస్తులను ఆహ్వానించారు. అంతేకాదు, జూనియర్ సెలక్షన్ కమిటీలో కూడా ఒక ముఖ్యమైన స్థానం భర్తీ కానుంది.
సెప్టెంబర్ 10వ తేదీ వరకు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. కొత్త సెలక్టర్ల ఎంపిక తర్వాత, రాబోయే సిరీస్‌లు మరియు టోర్నమెంట్‌ల కోసం జట్టు నిర్మాణంపై మార్పులు కనిపించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
